23 Apr 2017

My thoughts...

                   చిన్నా,,, ఎలా ఉన్నావు,,, మేం బాగున్నామనే అనుకుంటున్నాం, అలా అనుకోవడమే బాగుంది..నీవు లేకపోతే మేం ఉండలేమా,, నువ్వు పుట్టకముందు మేం లేమా,, ఇప్పుడు మాత్రం ఎందుకు మేం లేం,,,, అని చాలా సార్లు ఆలోచించా,,
జవాబు దొరకలేదు,, మేం కన్న కలలనుండి నువ్వెల్లిపొయావనా మాకు ఇంత బాధ, అనికూడ ఆలోచన వచ్చింది..కాదు, కానే కాదు.నీ కోసం నీవు ఎన్ని కలలు కన్నావు, మమ్నీ ఇలా ఉండాలి, మమ్మి అలా ఉండాలి, కాని ఇప్పుడు ఎలా ఉన్నావ్,,
చాలా సార్లు ప్రశ్నించుకున్నాం మమ్ములని మేము,, మేము చేసిన నేరమేంటొ, సమాధానం దొరకలేదు.నీ పై కోపం వచ్చినపుడు నేను నీతో మాట్లాడే దాన్నికాదు..నువ్వెన్ని సార్లు బ్రతిమిలాడి నాతో మాట్లాడేవాడివొ గుర్తొచ్చి,, నువ్వు కూడ మాపై కోపంతొ మాట్లాడ్డం లేదనిపించి చాలాసార్లు బ్రతిమిలాడాను, నీ దగ్గరినుండి సమాదానం రాలేదు..
నీకో విషయం చెప్పాలి,, రెండు మూడు రోజుల క్రితం నేను డాడి , వర్ష శాపింగ్ వెల్లాం, అక్కడ నేను ,వర్ష, నీ కోసం డ్రెస్ కావాలని అడిగాం. నువ్వెలా ఉంటావొ చెప్పి షర్ట్ అడిగాం..వాడెమన్నాడొ తెలుసా..ఈ సైజుతో రెడీమెడ్ కస్టం కుట్టించండి అని చెపుతున్నాడు.. వర్ష, నేను నవ్వుకున్నాం...అది విని..

ఎందుకో ఇప్పటికీ నువ్వు మాతో ఉన్నావని అనిపిస్తుంది... నీకు ఎన్నో విషయాలు చెప్పాలనిపిస్తుంది, కాని చెప్పలేకపోతున్న..అన్నట్టు బాహుబలి2 కూడ విడుదల అవుతుంది..నీతో పాటు మల్లీ అది చూడాలని ఉంది..ఎప్పటిలా రుషీల్ ఇంటికి వస్తున్నాడు..
నువ్వు చేస్తానన్న మా సిల్వర్ జుబ్లి వస్తుంది....నువ్వు, వర్ష కలిసి చేస్తాం అన్నారు..బహుశా అది మర్చిపోయి ఉంటావ్...
ఈ సంవత్సరంలో నీ బి టెక్ అయిపోయ ఉండేది..మల్లీ చెపుతున్న కాంపస్ సెలక్షన్ లో రాలేదంటే చూడు..
ఇంకా చాలా తిట్టాలనిపిస్తుంది.......
మనం అమ్మమ్మ వాల్లింటినుండి మనింటికి వచ్చే రోడ్ లో ఇప్పుడు నేనొక్కదాన్నే వెల్లివస్తూ, నువ్వు ఆ రోడ్ మీద వెల్లేటపుడు చెప్పేవిషయాలే ఎప్పుడు గుర్తొస్తున్నాయి...

ఎడవాలని ఉంటుంది బిగ్గరగా..డాడి దగ్గర ఎడవలేను,, ఇంకా ఎక్కువ ఆలోచిస్తాడని,, వర్ష దగ్గర ఎడవలేను బయపడుతుందని, అమ్మమ్మ తాతయ్మ దగ్గర ఎడవలేను వాల్ల ఆరోగ్యం పాడవుతుందని, పిన్ని దగ్గర ఏడవలేను నాతో పాటు ఏడుస్తుందని...ఒంటరిగా ఏడవలేను ఆపలేనేమొ అని బయపడి....కాని అప్పుడప్పుడు నీతో ఇలా మాట్లాడితే మాత్రం నాకు కండ్లలొ నీటితో పాటు పెదవిపై నవ్వూ వస్తుంది...
ఎవరికి తెలియని విషయం ఏంటంటే నువ్వు నాకు ఒక కొడుకువి మాత్రమే అనుకుంటారు అందరు..కాని నాకు నువ్వొక మంచి మిత్రుడవని తెలియదు...
నవ్వొచ్చే విషయం ఏంటంటే,, ఒ రోజు నువ్వు కలలో వచ్చావని వర్షకి చెప్పా, అదేమంటుందొ తెలుసా ఎలా ఉన్నాడు అన్న, తింటున్నాడటనా జిమ్ కి వెలుతున్నాడా, లేక లావు అయ్మాడా..అక్కడ నువ్వు వండినట్టే ఉందటనా ఫుడ్.. అని నా బుర్ర తిన్నదిరా...హహహ

24 Sept 2016

పుట్టిన రోజు శుభాకాంక్షలు 🌷.....

అక్షిత్,,,
 
పుట్టిన రోజు శుభాకాంక్షలు 🌷.....
నీవు లేకుండానే నీ పుట్టిన రోజును జరుపుకోవడం రెండోసారి,, బహుశా ఎక్కడినుండైనా మా ఆశీర్వాదం తీసుకుంటావని ఓ చిన్న ఆశ.....

గత వైభవ శిథిలాల మధ్య , భవిష్యత్  పునాదులు వేస్తు మేము,,,, నింగిలో  తారకలా  నీవు..

నీ కనుపాపల  నవ్వులకోసం ఎదురుచూసే మేము,,,మా కంటి పాపవై నిలిచిపోయిన నీవు....

పుట్టినరోజు విషెష్ చెప్పడానికి ఉదయం  నుండి  నీకోసం వచ్చే ఫోన్స్ మూగపోయాయి,,  నీవులేవని.

మద్యాహ్నం నుండే  రాత్రికి ఏ హోటల్ లో డిన్నర్ చేద్దామని హడావుడి చేసే నీ చెల్లెలు,,, తినడానికి ఏదో ఓకటిలే అని చప్పుడు లేకుండా కూర్చుంది నీవు రావని...

అందరు అంటున్నారు ఏదో జన్మలో పాపం చేసాం అందుకే ఈ శిక్ష అని,,, మేము అనుకుంటున్నాం ఏదో పుణ్యమే చేసుంటాము, అందుకే నీతో 20సం,, గడిపే అవకాశం దేవుడు మాకిచ్చాడని...

చూడు మమ్మి నా చేతులు ఎంత పెద్దగా ఉన్నాయో,  నాకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసాడు, నేను పేద్ద గోల్ కీపర్ ని అవుతానన్నావుగా,,  అవును అందుకే తనతో ఆడమని నిన్ను తీసుకొని  వెల్లిపోయాడు...😢

ఇప్పుడు మాకు తగిలే ప్రతి చిరుగాలి నీ పిలుపులా వినిపిస్తుంది.
ప్రతి సువాసన నీ నవ్వులా మాకనిపిస్తుంది.

పిచ్చి పిచ్చి ఫోన్లన్ని కొనకు,  మంచి ఐ ఫోన్ కొనుక్కో  అని తిడుతావుగా,,, ఇప్పుడు కూడ పిచ్చి ఫోన్ కొన్నాను,  తిట్టడానికి వస్తావేమో అని...  😀

సాయంత్రం కేక్ కట్ చేస్తాం, ఏ ఫ్లేవర్ కావాలో ముందే చెప్పు,  తర్వాత నాకు నచ్చలేదంటే ఊరుకునేది లేదు..😠

మరోసారి  నీ 21 టవ పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నా....

నీ,
మమ్మి, డాడి, చెల్లెలు...

26 Jul 2016

సరిగ్గా సంవత్సరం గడిచిపోయింది

చిన్నా,,,,,,
నీవు మమ్ములని వదిలిపోయి సరిగ్గా సంవత్సరం గడిచిపోయింది..నీవింకా మా దగ్గరే ఉన్నావనిపిస్తుంది..
నిన్ను నిద్రలేపడానికి నేనింకా నీ గడ్డాన్ని పీకుతున్నట్టే అనిపిస్తుంది..
నీవు చివరిసారిగా బయటకు వెల్లేటపుడు  నన్ను హగ్ చేసుకొన్న స్పర్శ ఇంకా అలాగే ఉంది.
తొందరగా వస్తాను మమ్మి అని చెప్పిన మాటలు ఇంకా నా చెవులను సోకుతూనే ఉన్నాయి.
చివరిసారిగ  ముద్దుపెట్టుకున్న నీ నుదిటి చల్లదనపు స్పర్శ ఇంకా నా వంట్లో వణుకు తెప్పిస్తూనే ఉంది.


అంతా నిశబ్దంగా అనిపిస్తుంది, డాడి పేపర్ చదువుతూ కూర్చున్న, ఇంట్లో ఓ మూల టీవి మొగుతూ ఉన్నా,, చెల్లెలు ఏదో మాట్లాడుతూ ఉన్నా,,,ఇంకా ఏదో నిశబ్దంగా ఉంది. బహుశా నీ పిలుపు వినడానికే కావచ్చు.


ఇప్పుడుకూడ నీ మాటలు తప్ప, నాకు వేరే ఎవరి మాటలు నినబడ్డం లేదు,, ఇప్పుడు కూడ నాకు నీ అవసరాలు తప్ప ఎవరివి గుర్తుకు రావడం లేదు, ఇప్పుడు కూడ నాకు, నీపై అట్లకాడతో కొట్టడానికి పరుగెడుతున్నట్టే ఉంది,,సగం విరిగిపోయిన అట్లకాడను చూసినప్పుడు. ఇప్పుడు కూడ నేను నవ్వినపుడు, అది నీ నవ్వే అనిపిస్తుంది.ఇప్పుడు కూడ "ఇదే చివరి ముద్ద" వదలకుండ తిను అని నీ పై అరుస్తున్నట్టే ఉంది.

నేను నీ కోసం రాసుకొనే ప్రతీ అక్షరం నీతో మాట్లాడుతున్నట్టే ఉంది.. ఏదో ఒకరోజు నిన్ను కలుస్తాననే నమ్మకం కలుగుతుంది, ఏదో ఒకరోజు ఎలా ఉన్నావు మమ్మీ అని నీవడుగుతావనే అనిపిస్తుంది, ఏదో ఒకరోజు మనమంత కలిసి  ఆనందంగా ఉంటామనిపిస్తుంది.

"OH GOD"NEVER SEPARATE US BECAUSE WE CAN'T LIVE WITHOUT EACH OTHER..






22 Jul 2016

నీతో మాట్లాడాలని, గొడవ పెట్టుకోవాలని, తిట్టాలని ఉంది.

చిన్నా,,,,
చాలా రోజులనుండి నీతో మాట్లాడాలని, గొడవ పెట్టుకోవాలని, తిట్టాలని ఉంది.
కాని నాకా అదృుస్టం లేదేమొ, నేను మాట్లాడుతుంటే, నువ్వు 'అవునా మమ్మి' అని అడుగుతావేమొ, లేక 'అయ్యా, 'ఏంటి మమ్మీ' అని అంటావేమొ అని, 'ఇంత చిన్న విషయానికే ఏంటి మమ్మీ' అంటావేమొ అని చూస్తున్నా.😔
నీకో విషయం చెప్పాలి, నిన్న డాడీ, నేను, వర్ష, సుల్తాన్ మువీకి వెల్లాం, నీకిస్టమైన హిరో సల్మాన్ ది. థియేటర్ ఫుల్ అయిపోయింది,, కాని నా పక్కన ఎప్పూడు నువ్వు కూర్చోని ఉండే సీట్ కాళీగా ఉంది,,😊 నువ్వొచ్చావని వర్షకు చెపితే అవును మమ్మీ అంది...నిజంగానే నువ్వొచ్చావా,,,,
నువ్వు మమ్ములని వదిలేసి వెల్లినపుడు ఎలా ఉన్నామొ, ఇప్పటికి అలాగే ఉన్నాము. జీవితంలో ముందుకు వెల్లాలి అని ఎందరు చెప్పినా, అది మాకు సాధ్యం కాదేమొ అనిపిస్తుంది.
మొన్నోరోజు  వర్ష, డాడి, నేను మన పాత ఇంటి దగ్గరికి వెల్లొచ్చాము, వర్ష అక్కడ ఉన్నప్పుడు చాలా చిన్నది గదా, అక్కడ మనకు తెలిసిన వాల్లందరి ఇంటికి వెల్లొచ్చింది,, అందరితో మాట్లాడుతుంటే వాల్లంత నీ గురించే చెప్పారంట, మీ అన్నని చిన్నప్పుడు మీ అమ్మ చాలా కొట్టేది, మీ అన్న బాగా అల్లరి చేసేవాడని చెప్పారట..ఇంటికి రాగానే అది నన్ను ఏమని అడుగుతుందో తెలుసా,,,,, మమ్మి, నీకు నాకంటే అన్ననే చాలా ఇష్టం కదా అని అడుగుతుంది,, ఏంందుకు అలాగ అని నేను అడుగుతే , మరి నన్నెపుడు నువ్వు కొట్టలేదు, ఎందుకు,,అన్న అంటనే నీకు చాలా ఇష్టం, అందుకే అన్ననే కొట్టేదానివి అని మొహం మాడ్చుకొని కూర్చుందిరో,,,😃

23 Jun 2016

ఎన్నిసార్లు పిలవాలిరా,, వినబడ్డం లేదా

చిన్నా చిన్నా చిన్నా,,
ఎన్నిసార్లు పిలవాలిరా,, వినబడ్డం లేదా బదులే చెప్పవేంటి,,
(మమ్మీ మమ్మీ మమ్మీ,,
ఎన్నిసార్లు పలకాలి మమ్మి,, వినబడ్డం లేదా  బదులు చెప్పినా కూడ )

నేను పిలిచిన పిలుపు నీకు వినబడ్డం లేదో, లేక  నీవు చెప్పిన జవాబు నాకు వినబడ్డం లేదో అర్దం కావడం లేదు,