24 Sept 2016

పుట్టిన రోజు శుభాకాంక్షలు 🌷.....

అక్షిత్,,,
 
పుట్టిన రోజు శుభాకాంక్షలు 🌷.....
నీవు లేకుండానే నీ పుట్టిన రోజును జరుపుకోవడం రెండోసారి,, బహుశా ఎక్కడినుండైనా మా ఆశీర్వాదం తీసుకుంటావని ఓ చిన్న ఆశ.....

గత వైభవ శిథిలాల మధ్య , భవిష్యత్  పునాదులు వేస్తు మేము,,,, నింగిలో  తారకలా  నీవు..

నీ కనుపాపల  నవ్వులకోసం ఎదురుచూసే మేము,,,మా కంటి పాపవై నిలిచిపోయిన నీవు....

పుట్టినరోజు విషెష్ చెప్పడానికి ఉదయం  నుండి  నీకోసం వచ్చే ఫోన్స్ మూగపోయాయి,,  నీవులేవని.

మద్యాహ్నం నుండే  రాత్రికి ఏ హోటల్ లో డిన్నర్ చేద్దామని హడావుడి చేసే నీ చెల్లెలు,,, తినడానికి ఏదో ఓకటిలే అని చప్పుడు లేకుండా కూర్చుంది నీవు రావని...

అందరు అంటున్నారు ఏదో జన్మలో పాపం చేసాం అందుకే ఈ శిక్ష అని,,, మేము అనుకుంటున్నాం ఏదో పుణ్యమే చేసుంటాము, అందుకే నీతో 20సం,, గడిపే అవకాశం దేవుడు మాకిచ్చాడని...

చూడు మమ్మి నా చేతులు ఎంత పెద్దగా ఉన్నాయో,  నాకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసాడు, నేను పేద్ద గోల్ కీపర్ ని అవుతానన్నావుగా,,  అవును అందుకే తనతో ఆడమని నిన్ను తీసుకొని  వెల్లిపోయాడు...😢

ఇప్పుడు మాకు తగిలే ప్రతి చిరుగాలి నీ పిలుపులా వినిపిస్తుంది.
ప్రతి సువాసన నీ నవ్వులా మాకనిపిస్తుంది.

పిచ్చి పిచ్చి ఫోన్లన్ని కొనకు,  మంచి ఐ ఫోన్ కొనుక్కో  అని తిడుతావుగా,,, ఇప్పుడు కూడ పిచ్చి ఫోన్ కొన్నాను,  తిట్టడానికి వస్తావేమో అని...  😀

సాయంత్రం కేక్ కట్ చేస్తాం, ఏ ఫ్లేవర్ కావాలో ముందే చెప్పు,  తర్వాత నాకు నచ్చలేదంటే ఊరుకునేది లేదు..😠

మరోసారి  నీ 21 టవ పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నా....

నీ,
మమ్మి, డాడి, చెల్లెలు...

26 Jul 2016

సరిగ్గా సంవత్సరం గడిచిపోయింది

చిన్నా,,,,,,
నీవు మమ్ములని వదిలిపోయి సరిగ్గా సంవత్సరం గడిచిపోయింది..నీవింకా మా దగ్గరే ఉన్నావనిపిస్తుంది..
నిన్ను నిద్రలేపడానికి నేనింకా నీ గడ్డాన్ని పీకుతున్నట్టే అనిపిస్తుంది..
నీవు చివరిసారిగా బయటకు వెల్లేటపుడు  నన్ను హగ్ చేసుకొన్న స్పర్శ ఇంకా అలాగే ఉంది.
తొందరగా వస్తాను మమ్మి అని చెప్పిన మాటలు ఇంకా నా చెవులను సోకుతూనే ఉన్నాయి.
చివరిసారిగ  ముద్దుపెట్టుకున్న నీ నుదిటి చల్లదనపు స్పర్శ ఇంకా నా వంట్లో వణుకు తెప్పిస్తూనే ఉంది.


అంతా నిశబ్దంగా అనిపిస్తుంది, డాడి పేపర్ చదువుతూ కూర్చున్న, ఇంట్లో ఓ మూల టీవి మొగుతూ ఉన్నా,, చెల్లెలు ఏదో మాట్లాడుతూ ఉన్నా,,,ఇంకా ఏదో నిశబ్దంగా ఉంది. బహుశా నీ పిలుపు వినడానికే కావచ్చు.


ఇప్పుడుకూడ నీ మాటలు తప్ప, నాకు వేరే ఎవరి మాటలు నినబడ్డం లేదు,, ఇప్పుడు కూడ నాకు నీ అవసరాలు తప్ప ఎవరివి గుర్తుకు రావడం లేదు, ఇప్పుడు కూడ నాకు, నీపై అట్లకాడతో కొట్టడానికి పరుగెడుతున్నట్టే ఉంది,,సగం విరిగిపోయిన అట్లకాడను చూసినప్పుడు. ఇప్పుడు కూడ నేను నవ్వినపుడు, అది నీ నవ్వే అనిపిస్తుంది.ఇప్పుడు కూడ "ఇదే చివరి ముద్ద" వదలకుండ తిను అని నీ పై అరుస్తున్నట్టే ఉంది.

నేను నీ కోసం రాసుకొనే ప్రతీ అక్షరం నీతో మాట్లాడుతున్నట్టే ఉంది.. ఏదో ఒకరోజు నిన్ను కలుస్తాననే నమ్మకం కలుగుతుంది, ఏదో ఒకరోజు ఎలా ఉన్నావు మమ్మీ అని నీవడుగుతావనే అనిపిస్తుంది, ఏదో ఒకరోజు మనమంత కలిసి  ఆనందంగా ఉంటామనిపిస్తుంది.

"OH GOD"NEVER SEPARATE US BECAUSE WE CAN'T LIVE WITHOUT EACH OTHER..






22 Jul 2016

నీతో మాట్లాడాలని, గొడవ పెట్టుకోవాలని, తిట్టాలని ఉంది.

చిన్నా,,,,
చాలా రోజులనుండి నీతో మాట్లాడాలని, గొడవ పెట్టుకోవాలని, తిట్టాలని ఉంది.
కాని నాకా అదృుస్టం లేదేమొ, నేను మాట్లాడుతుంటే, నువ్వు 'అవునా మమ్మి' అని అడుగుతావేమొ, లేక 'అయ్యా, 'ఏంటి మమ్మీ' అని అంటావేమొ అని, 'ఇంత చిన్న విషయానికే ఏంటి మమ్మీ' అంటావేమొ అని చూస్తున్నా.😔
నీకో విషయం చెప్పాలి, నిన్న డాడీ, నేను, వర్ష, సుల్తాన్ మువీకి వెల్లాం, నీకిస్టమైన హిరో సల్మాన్ ది. థియేటర్ ఫుల్ అయిపోయింది,, కాని నా పక్కన ఎప్పూడు నువ్వు కూర్చోని ఉండే సీట్ కాళీగా ఉంది,,😊 నువ్వొచ్చావని వర్షకు చెపితే అవును మమ్మీ అంది...నిజంగానే నువ్వొచ్చావా,,,,
నువ్వు మమ్ములని వదిలేసి వెల్లినపుడు ఎలా ఉన్నామొ, ఇప్పటికి అలాగే ఉన్నాము. జీవితంలో ముందుకు వెల్లాలి అని ఎందరు చెప్పినా, అది మాకు సాధ్యం కాదేమొ అనిపిస్తుంది.
మొన్నోరోజు  వర్ష, డాడి, నేను మన పాత ఇంటి దగ్గరికి వెల్లొచ్చాము, వర్ష అక్కడ ఉన్నప్పుడు చాలా చిన్నది గదా, అక్కడ మనకు తెలిసిన వాల్లందరి ఇంటికి వెల్లొచ్చింది,, అందరితో మాట్లాడుతుంటే వాల్లంత నీ గురించే చెప్పారంట, మీ అన్నని చిన్నప్పుడు మీ అమ్మ చాలా కొట్టేది, మీ అన్న బాగా అల్లరి చేసేవాడని చెప్పారట..ఇంటికి రాగానే అది నన్ను ఏమని అడుగుతుందో తెలుసా,,,,, మమ్మి, నీకు నాకంటే అన్ననే చాలా ఇష్టం కదా అని అడుగుతుంది,, ఏంందుకు అలాగ అని నేను అడుగుతే , మరి నన్నెపుడు నువ్వు కొట్టలేదు, ఎందుకు,,అన్న అంటనే నీకు చాలా ఇష్టం, అందుకే అన్ననే కొట్టేదానివి అని మొహం మాడ్చుకొని కూర్చుందిరో,,,😃

23 Jun 2016

ఎన్నిసార్లు పిలవాలిరా,, వినబడ్డం లేదా

చిన్నా చిన్నా చిన్నా,,
ఎన్నిసార్లు పిలవాలిరా,, వినబడ్డం లేదా బదులే చెప్పవేంటి,,
(మమ్మీ మమ్మీ మమ్మీ,,
ఎన్నిసార్లు పలకాలి మమ్మి,, వినబడ్డం లేదా  బదులు చెప్పినా కూడ )

నేను పిలిచిన పిలుపు నీకు వినబడ్డం లేదో, లేక  నీవు చెప్పిన జవాబు నాకు వినబడ్డం లేదో అర్దం కావడం లేదు,

11 Jun 2016

పిల్లలను స్వేచ్చగా ఎగరనివ్వాలి

చిన్నా,,,,

నీవు లేవన్న విషయం  ఇంకా నా మనసుకి సర్ది చెప్పలేకపోతున్న,
నీవు లేవన్న విషయం గుర్తుకు వస్తే, గుండెను ఎవరో నలిపేస్తున్నట్టుగా ఉంది,
నీవు లేవన్న విషయం మర్చిపోదామంటే మరుపన్నదే రావడం లేదు,
నీవు లేవన్న విషయమే ఆలోచించద్దంటే వాటికి  అంతమే లేకుండ ఉంది,
నీవు లేవన్న విషయం నా కంట  కన్నీరే ఆరనీయడం లేదు,
నీవు లేవన్న విషయం నాకు విషమంగా అనిపిస్తుంది,
నీవు మాతో ఉన్న 19 సం,, అనుభవం  కన్న, నీవులేని ఈ మొదటి సం,, మాకు మరో 20సం,, అనుభవాన్ని ఇచ్చి వెల్లిపోయావు ....

పిల్లలను స్వేచ్చగా ఎగరనివ్వాలి, మన మీద ప్రేమ ఉంటే తిరిగి మన దగ్గరికే వస్తారని నమ్మేదాన్ని,, అవును ,,, నీకు మేమంటే చాలా ఇస్టమని మాకు తెలుసు, అందుకే  నీవు మల్లీ తిరిగి వస్తావని...మా నమ్మకం.....

29 May 2016

ఏంటి మమ్మి చాలా రోజుల తరువాత మాట్లాడుతున్నావు

చిన్నా,,,,,
ఏంటి మమ్మి చాలా రోజుల తరువాత మాట్లాడుతున్నావు ఎందుకు అలా,, అని అడుగుతున్నావు కదూ,,
అవును,,,, డాడి కి హెల్త్ బాలేదు , హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పెటల్ లో జాయిన్ చేసాను,, బయపడకు , ఇప్పుడు బాగానే ఉంది. స్టంట్ వేసారు.....6  రోజులు హాస్పెటల్ లో ఉన్నారు... డాక్టర్స్ కి కూడ అర్దం అవడం లేదు ఎందుకు వచ్చిందో,,, అన్ని నార్మల్ రిపోర్ట్స్.. బిపి లేదు, షుగర్ లేదు, కొలస్ట్రాల్ లేదు.. డాక్టర్స్ రోజు వాకింగ్ కి వెల్లమన్నారు. నీకు తెలుసుగా, డాడి రోజు వాకింగ్ , యొగా చేస్తారని..ఫుడ్ హాబిట్స్ తగ్గించుకొమ్మన్నారు...డైటీషియన్ చెప్పిన విషయాలు విన్న తరువాత , డాడి నేను నవ్వుకున్నాము. ఎందుకో తెలుసా, డాడి దాదాపుగా 20 సం,, నుండి అదే డైట్ ఫాలో అవుతున్నారు...వంశపారంపర్యంగా వస్తుందేమొ అన్నారు,,, హుహూ,, అది కూడ కాదట, ఎందుకంటే మనింట్లో ఇంతవరకు ఎవరికి హార్ట్ అటాక్ రాలేదు..

ఫైనల్ గా వాల్లు తేల్చింది ఏంటో తెలుసా,,,మానసిక ఆందోళన వలన అట....నువ్వు రెండు రోజులు ఫోన్ చేయకపోతెనే వర్రీ అవుతారు, మూడు రోజులకోసారి స్కైప్ లో మాట్లాడకపోతేనే జ్వరం వచ్చినట్టవుతుంది...

ఇప్పుడు నువ్వు రాలేవని తెలిసిన తరువాత డాడి ఎలా తట్టుకోగలరు...

నీకో గుడ్ న్యూస్ రా,,, చెల్లెకు 10th లో 8 పాయింట్స్ వచ్చాయి,, పాపం అది చదివిందే లేదురా ,,,ఎప్పుడు నన్ను చూడడమే సరిపోయింది...పోనిలే బాగానే వచ్చాయిగా,,,మొన్నోరోజు పందిదానా అన్నానురా దాన్ని,, మమ్మి అలా పిలవద్దు, అలా  అన్న ఒకడే పిలుస్తాడు ...Only my brother has that right అంటుందిరా,,,,


15 May 2016

నువ్వసలు చదువుతున్నావా, పాసవుతావ

చిన్నా,,,,

ఏం చేస్తున్నావురా , ఎన్నిసార్లు పిలవాలి, వినబడ్డం లేదా,,అసలు నువ్వేమి చేస్తున్నావు, ఇంకా ఎగ్ఙామ్స్ ఎన్నిరోజులున్నాయి. నువ్వసలు చదువుతున్నావా, పాసవుతావ...కాంపస్ సెలక్షన్ లో వస్తుందా,,, బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకో , నేనేమి చేస్తానో నాకే తెలియదు..
ఈ మద్స నీకు బద్దకం బాగా పెరిగింది, ఎన్నిరోజులవుతుంది స్కైపులోకి వచ్చి , ఎప్పుడు చూడు ఫ్రెండ్స్ అని తిరుగుకూనే ఉంటావు..మమ్మీ, డాడి ఎప్పుడన్న గుర్తుకువస్తారా నీకు,  కాస్త ఫోన్ లో చాటింగ్ తగ్గించురా,,, బండి స్పీడ్ గా నడుపుతున్నావా, నాకు తెలియకుండ స్విమ్మింగ్ కి వెలుతున్నావా,, వద్దు వెల్లకు..
ఏదో ఫోటో షూట్ కి డబ్బులవుతాయని అన్నావుగా , డాడి పంపిచ్చినయ్ సరిపోయినవా, ఇంకా కావాలా,,
ఎప్పుడు నేను ఫోను చేయడమే కాని నువ్వెప్పుడైనా ఫోన్ చేసావా..మాడలింగ్ చేస్తానంటవ్ కానివ్వు నేనేమి అనను, కాని బేసిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ముందు చదువు పూర్తిచేయి..  అన్నం సరిగ్గా తింటున్నావా, జిమ్ లో గంటల తరబడి ఉండకు..  నీ ఫ్రెండ్ రుషీల్ ఫోన్ చేస్తున్నాడా, నువ్వు మల్లీ ఎప్పుడస్తావు. వచ్చేముందు చెప్పు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను.....



చాలా రోజులనుండి ఇలా తిట్టాలని ఉందిరా,, ఏంటి మమ్మి ఎందుకు తిడుతున్నావు, అంటు నవ్వే నిన్ను చూడాలని ఉందిరా........

3 May 2016

రఘువరన్ b-tech ,,,,

రఘువరన్ b-tech ,,,,

నీకు ఇస్టమైన సినిమా,, మొదటి సారిి నన్ను కూర్చోబెట్టి , బాగుంటుంది మమ్మి చూడు అని నాతో పాటు నువ్వుకూడ చూసిన సినిమా,, నాకు నచ్చింది ఆ సినిమా బాగుందిరా  అన్నాను కూడ.  తర్వాత మనం ఎన్నిసార్లు కలిసి చూసామురా అది,, గుర్తుందా నీకు వాల్ల అమ్మ చనిపోయిన సీన్ నీకు నచ్చేది కాదు,,, వాడిలాంటి బైక్ నీకు కూడ కొనిస్తానన్నాను.. ఎన్నిసార్లు నవ్వుకున్నాంరా,  అందులో కామెడి సీన్ లు చూస్తు....
హిరో చెప్పే ప్రతీ డైలాగ్ నువ్వు చెప్పేవాడివి. కొన్నిసార్లు నీ డైలాగ్స్ వినడానికే ఆ సినిమా చూసేవాల్లం. గుర్తుకొస్తుందా.....

ఇప్పుడు నేను అదే చూస్తున్న,, నేనొక్కదాన్నే చూస్తున్నాకూడ నీతో కలిసి చూస్తున్నట్టే అనిపిస్తుంది....
కాని సినిమా కనిపించట్లేదు కన్నీటితో,, కాని నీ డైలాగ్స్ మాత్రం వినబడుతున్నాయి, హిరో చెప్పే డైలాగ్స్త్ తో కలిసిపోయి......

29 Apr 2016

My Achhu Photos 2

My Achhu
నీ చిరునవ్వులకు చిరునామ ఏది, నీ అల్లరి చేస్టలకు అడ్రస్ చెప్పగలవా , నీ బాద్యతలన్ని చెల్లెలి చిరుబుజాలపై వదిలేసావా,  నీవు అబద్దం ఆడినపుడు మాత్రమే కనబడే నీ కనుపాపల నవ్వు ఎవరికి పరిచయం చేస్తున్నావ్,, మమ్మీ నా ఫేస్ నీలా ఉంటుందా, లేక డాడిలా ఉంటుందా, మమ్మి నా హైట్ పర్సనాల్టి నీలా ఉందా , లేక డాడిలా ఉందా,, నేను నవ్వుతే నీలా ఉంటానా లేక డాడిలా ఉంటానా , నా కలర్ ఎవరిది,  డాడిలా తెల్లగా లేను, నీలా చామనచాయకాదు. ఇది మాత్రం తాతయ్యది అయ్యి ఉంటది. మమ్మి నాకు పన్నీరంటే ఏందుకు పడదు,,మమ్మీ ట్రెక్కింగ్ చేయడానికి వెలదామ,, బంగీ జంప్ చేయాలి మమ్మి,, నెలకు 50.000 /- సంపాదిస్తే సరిపోతుంది కదా మమ్మి,, ఇంకా ఎక్కువ సంపాదించి డబ్బులు ఏం చేస్తారు మమ్మి,,  నా చిన్నప్పటి విషయాలు చెప్పు మమ్మి వింటాను....

కాసేపైనా ప్రశాంతంగా కూర్చోనివ్వురా, ఏప్పుడు చూడు నీ గోలేనా అన్నాను అంతే కదా....
జీవితాంతం ప్రశాంతంగా కూర్చో అని వదిలేసి వెల్లిపోయావా...
నిన్ను చూడాలని ఉందిరా,, ఇంకెప్పుడు అనను నీ గోల ఆపమని....

19 Apr 2016

వెలితిగా అనిపిస్తుందిరా నీవు లేని జీవితం

చిన్నా,,,,,,
ఎలా ఉన్నావు,  బాగున్నావనే అనుకుంటాను. వెలితిగా అనిపిస్తుందిరా  నీవు లేని జీవితం. ఈ లోటును ఎలా పూడ్చాలో  అర్దం కావడం లేదు,  ఆప్తులతో మాట్లాడినా, అవసరం లేని పనులు ఎన్ని చేసిన,  రోజు చివరన నీ ఆలోచనలతోనే ముగుస్తుంది.

నువ్వెప్పుడు అనే వాడివి కదా, 'మమ్మి, ఎలాగైనా నిన్ను నేను సర్ ప్రైజ్ చేస్తాను, ఈ సారి నా ఫోన్ 10 రోజులు స్విచ్చ్ ఆఫ్ చేసుకొని, నీకు అసలే దొరక్కుండా సర్ ప్రైజ్ చేస్తా'  అని చెప్ప్పావుగా,,,,, నువ్వు నాకు సర్ ప్రైజ్ కాదురా షాక్ ఇచ్చావు,, నీ లైఫ్ ని స్విచ్ ఆఫ్ చేసుకొని..వెల్లిపోయావు.

నీ కోసం రాసుకొనే ఈ నా ప్రతీ అక్షరం నా కన్నీటి బొట్టేరా.
నీవు లేవనే వాస్తవం లో కన్న, నువ్వెప్పుడైనా వస్తావనే నమ్మకంతోనే బ్రతుకుతున్నాం.
అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నీకు ఇస్టమైనవి ముంజల్ డాడి తీసుకొచ్చారు, అదేరా నువ్వంటావుగా , డాడీ  ' మూన్ లా తెల్లగా , జెల్లిలా ఉంటుంది మూన్ జెల్ తీసుకరా' అంటావుగా అవి.....

6 Apr 2016

నీ తిట్లు విని చాలా రోజులైంది,,

చిన్నా,,,,,

నీ తిట్లు విని చాలా రోజులైంది,, ఒక్కసారి వచ్చి తిట్టేసి పో,,నీ కోపాన్ని ఓసారి చూపించి పో..
రోజు పొద్దున్నే , నీ బెడ్ షీట్ మడతలు లేకుండా సర్దుతుంటే, వద్దు మమ్మి నాకు అలా ఇస్టం ఉండదు, ముడతలుగానే ఉండనివ్వు దాన్ని ,,, అని ఒక్కసారి విసుక్కోని వెల్లిపో..
పాటలు పాడుతూ పనులు చేసుకుంటుంటే,, మమ్మి , నువ్వు ఏ రాగం పాడినా ఒకేలా అనిపిస్తుంది, ఏడుపు పాటలు, డ్యూయెట్ పాటలు ఒకేలా పాడుతావు,,ఆపమ్మా, నీ పాటలను అని ఒక్కసారి చిరాకు పడి వెల్లిపోరా...
నేను వేసే ప్రతీ పేయింటింగ్ లో ఏదో ఓ లోపం వెతికి, సరిగ్గా వేయలేవా అని అసహనంతో చెప్పివెల్లిపోరా...
నీకు ఇస్టంలేని కూర వండినపుడు,, ఏంటి మమ్మి అడ్డమైన గడ్డి వండుతావు,,మల్లీ అది తింటే ఏంత బలమొ చెప్పి, నాతో తినిపిస్తావు , అని ఒక్కసారి గులిగి వెల్లిపోరా..
నా స్టడీస్ అయిపోయేలోపు మంచి బ్రిటీష్ ఆక్సెంట్ లో నువ్వు ఇంగ్లీష్ మాట్లాడ్డం నేర్చుకో మమ్మి,, క్లాసిక్ గా ఉంటుందది, అని ఒక్కసారి విసిగించి పోరా...
ఏంటి మమ్మి,, నీ ఫోన్ ని , ఐ పాడ్ ని అప్డేట్ చేసుకోవా,, ఏప్పుడు నేనే చేసివ్వాల అని కోపగించుకొని పోరా..
లాప్ టాప్ లో ఫైల్స్ కనిపించడం లేదురా అంటే,, మమ్మి , మల్లీ ఓ సారి బేసిక్ లెవల్ నుండి నేర్చుకో మమ్మి, అని తిట్టేసి వెల్లిపోరా..
మాకు చెపుతావు కాని, నువ్వు తింటుందేంటి, ఆ గడ్డి తింటే వీక్ నెస్ రాకుండా ఎలా ఉంటుంది, నాన్ వెజ్ తిను, లేకపోతే ఎగ్ ఐనా తిను మమ్మీ ,,అని అరిచేసి వెల్లిపోరా,,
ఇంటి మహాలక్ష్మి అని వర్షకు ఏ పనులు చెప్పకుండా తయారు చేస్తున్నావు, ఇప్పుడు చూడు నీకు ఒక్క హెల్ప్ చేయకుండా తయారవుతుంది, అని ఒక్కదసారి బెదిరించి వెల్లిపోరా,,,
పైనున్న సెల్ఫ్ లో డబ్బాలు అందకపోతే,,చెట్టంత కొడుకు నీకుండగా ఎందుకంత కస్టపడుతావు, నేను తీసిస్తాగా అని  ఒక్కసారి తిట్టేసి వెల్లిపోరా.
నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు, నా దగ్గర కూర్చోని ,అంత స్పీడ్ గా వెల్లకు మమ్మి, తొందర ఏమి లేదు, అని ఒక్కసారి బెదిరించి వెల్లరా...

అయ్యా,, మమ్మి, ఏంటిది, నేను ఎక్కడికి వెల్లానని,,,

4 Apr 2016

My Akshit's Photos ......... My Slideshow

My Akshit's Photos ......... My Slideshow
I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload)

My Akshit's Photos ......... My Slideshow

My Akshit's Photos ......... My Slideshow
I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload)

My Akshit photos ...... My Slideshow

My Akshit  photos  My Slideshow
I created this video with the YouTube Slideshow Creator (http://www.youtube.com/upload)

10 Mar 2016

చిన్నా,,,, నీ ఫ్రెండ్ వచ్చాడురా

చిన్నా ...... నీ ఫ్రెండ్ వచ్చాడురా

చిన్నా,,,, నీ ఫ్రెండ్ వచ్చాడురా,,నీ గురించి ఏవో చెప్పాడు, వింటూ కూర్చున్న, నీ గురించి నాకు తెలియని విషయాలు అనుకున్నాడు,,,నాకు తెలిసిన విషయాలు వింటున్నా కూడ, ఏమి తెలియనట్టే  కూర్చున్న... నువ్వు వాడిని ఎప్పుడు కాంటాక్ట్ చేస్తూన్నావట, వాడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడట:-)))))) వీడు ఇంకో పిచ్చోడిలా ఉన్నాడురా, నాలాగా :-)

నీకో విషయం తెలుసా ,,, నవ్యక్కకి ట్విన్స్ పుట్టారు, భలే ఉన్నారురా ఇద్దరు. నువ్వు బాబాయివి అయ్యావురా,,, నేనేమొ నానమ్మని, డాడి తాత అయ్యారు. చెల్లెకూడ అత్త అయ్యిందిరా.. నేను నానమ్మని అంటే,,,నువ్వు, 'అయ్యా, మమ్మి నువ్వు అప్పుడే ముసలి అయ్యావు' అంటున్నావు కదా,,, నీకు దెబ్బలయితాయిరో...హ...

గుర్తుందా, నువ్వోసారి,, మమ్మి, నాకు పిల్లలు పుడితే నువ్వేమవుతావు, చెల్లెలికి పుడితే నువ్వేమవుతావని అడిగావు,,

నీ పిల్లలకు నానమ్మని, చెల్లేలి పిల్లలకు అమ్మమ్మను అవుతానంటే, నీకు కోపం వచ్చి, నా పిల్లలకే అమ్మమ్మవి కా, లేకపోతే నేను పెళ్లే చేసుకోను, పిల్లలని అసలు కనను అని ఏడ్చావు, నాతో గొడవ పెట్టుకున్నావు..

ఆ విషయాలు గుర్తొస్తుంటే నవ్వొస్తుందిరా:-))))))



6 Mar 2016

కాలం ఎవరికోసం ఆగదు

కాలం ఎవరికోసం ఆగదు

నిన్ననే నీ తో ఉన్నాననిపిస్తుంది,,
కాని అప్పుడే ఏడు నెలలు గడిచిపోయాయి..

కాలం ఎవరికోసం ఆగదు,
ఖర్మ ఎవరిని వదలదు,

నిన్ను తీసుకొని వెల్లొచ్చు,
కాని నీ ఙ్జాపకాలని తీసుకెల్లడం,
ఆ దేవుడు తరం కూడ కాదు..




29 Feb 2016

నీ స్కూల్ ఫ్రెండ్

 నీ స్కూల్ ఫ్రెండ్

నీ స్కూల్ ఫ్రెండ్ ,,,,  అమ్మా, ఏంటమ్మ వీడు నా దగ్గరికి వస్తా అన్నాడు, మామ బీరు తాగుదాం రమ్మంటే ,నన్ను తిట్టాడు అమ్మా,, అసలు ఈ తాగడం ఏంటిరా ,,,ఎందుకు తాగుతారురా మీరు, ఇంకోసారి డ్రింక్ తాగుదాంరా అంటే మాత్రం బాగుండదని మస్తు కోపానికి వచ్చాడమ్మా,,
అమ్మా,,, ఏదైనా మాట్లాడమ్మా,,నాయినను , చెల్లెను చూసుకోండమ్మ,,ఏదైన అవసరం ఉంటే మేమున్నామమ్మా....

అమ్మమ్మ,,,,,,, రణిత వాడి గురించి ఏదైనా చెప్పు,, ఎప్పుడూ వాడి గురించే మాట్లాడుతావు కదా, వాడు అలా, ఇలా అని,,,నేను నీ కొడుకు గొప్పలు చెప్పడం అపేయవే ఇక అన్నాకూడ వాడి గురించే చెపుతావు,,
ఇప్పుడు నేను చెప్పమన్నాకూడ ఏమి మాట్లాడటం లేదు,,ఏదో ఒకటి చెప్పు..

స్కూల్ ఫ్రెండ్ భరత్,,,, ఆంటి మీరు చిన్నప్పుడు మా అందరికి అక్షిత్ తో పాటు సాయంత్రం చదువు చెప్పేవారు, చదువుకోవడానికి మేమంతా వస్తే వాడు కూడ మాతో చదువుతాడని,,వాడికి చెప్పినంత ఒపికగా చదివించారు,, ఒక్కోసారి వాడికి చదవాలని లేకపోతే స్కూల్ లోనే మాకు చెప్పేవాడు, ఈ రోజు ఇంటికి రావద్దురా , మీరు రాకపోతే మమ్మి నాకు కూడ ఈ రోజు హాలిడే ఇస్తుందనే వాడు.
వాడికి అసలు డబ్బుల విలువ తెలియదు ఆంటి, ఎవరు డబ్బులు అడిగితే వాల్లకు వేలైనా ఇచ్చేస్తాడు ఆంటి, పాపం వాల్లకు అవసరం ఉందటరా అంటాడు ఆంటి..

బాబాయిలు,,,,,,వదిన మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఒక్కసారి మీరు వాడిని తీసుకొని వెల్లిన వాడిపై కోపంగా ఉన్నానని చెప్పండి,, మన అక్షిత్ వెల్లిన దగ్గరికే వీడిని పంపిస్తాం..

హై స్కూల్ ఫ్రెండ్ ,,,, ఆంటి, కొత్త బైక్ కొన్నాక వాడికి చూపించాను ఆంటి,, హెల్మెట్ ఏది అని అడిగాడు, నేను డ్రైవ్ చేస్తుంటే, వెనక కూర్చోని, ఏంటిరా ఈ స్పీడు, మెల్లిగా వెల్లు, స్పీడ్ గా ఎప్పుడు డ్రైవ్ చేయకని చెప్పాడు .
సరు తాతయ్య,,,,,,, అసలు ఇది ఎప్పుడన్న సప్పుడు జేయక కూర్చుందా,,నోరు నొప్పి పుట్టేదాక వదురుతుంది, దీనికి ఎదురుగా ఎవరన్న మాట్లాడి గెలుద్దురా,,,
ఇప్పుడుచూడు,,అసలు మాటలే కరువైనట్టున్నాయి దీనికి.

ఇంటర్ ఫ్రెండ్,,,, ఆంటి నేను అక్షిత్ ఫోర్స్ చేయడం వలనే నేను జిమ్ లో చేరాను ,, నేను మల్లీ వచ్చేవరకు నీ బొర్ర కనబడద్దు అన్నాడు,,ఇప్పుడు నేను జిమ్ మానేసాను ఆంటి.

పిన్ని,,,,,,వాడు నా పెద్దకొడుకు, నీకెమవుతుందో అని బయమేస్తుంది అక్కయ్య..

స్పెషల్ ఫ్రెండ్,,,,ఆంటి వాడిని ఎలా పెంచారు మీరసలు, ఆమ్మాయిలతో మాట్లాడ్డానికి సిగ్గుపడుతాడు, నా ఫ్రెండ్స్ అక్షిత్ హాండ్సమ్  గా  ఉన్నావంటే సిగ్గు పడుతాడు,
నాతో మాట్లాడిన అరగంటలో 20 మినిట్స్ మీ గురించే చెపుతాడు , అసలు వాడేంటి అలా...

నీకు ఇష్టమైన ఫ్రెండ్,,,, ఆంటి, ఒక్కసారి నన్ను చూసి మాట్లాడండి, ప్లీజ్...
నేను వాడిని ఏమి చేయలేదు, వాడు నా జాన్ ఆంటి.

అందరు నేనే చంపాను అంటున్నారు, అందరితో నాకు పనిలేదు, మీరు ముఖ్యం నాకు, ఒక్కసారి మాట్లాడండి.
మీరు నన్ను చంపేసినా పర్వాలేదు, కాని ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్...

చిన్నా,, ఏంటిరా ఇది, వీల్లంతా నేను మౌనంగా ఉన్నానంటున్నారు, నీతో మాట్లాడుతున్నాగా,,అసలు నాదే తప్పులేరా, నీకు ఏదో ఒకటి చెడు అలవాటు నేర్పించాల్సింది, లేకపోతే నీవైనా నేర్చుకోవలసింది..

' ఏంటి మమ్మి' అంటున్నావ్ కదూ, నాకు తెలుసు...

17 Feb 2016

నీ కోసం నీ 'షు' ఎదురు చూస్తుంది

నీ కోసం నీ 'షు' ఎదురు చూస్తుంది

రోజు పొద్దున్నే నీ కోసం నీ 'షు' ఎదురు చూస్తుంది,,నీవు వాటిని వేసుకొని ఆడడానికి వెలుతావని,
ప్రతీ రోజు నీవు పాలు తాగే నీ ' కప్' ఎదురుచూస్తుంది,, నీవు పాలు తాగడానికి వస్తావని..
ప్రతిరోజు నీ కోసం నీ 'డంబెల్' ఎదురు చూస్తుంది,,నీవు తనని లేపడానికి వస్తావని..
ప్రతిరోజు నీ కోసం నీ ఫుట్ బాల్, నీ కాప్, గ్లౌస్ , వేచి ఉన్నాయి,నీవు వాటితో ఆడుకుంటావని..
రోజు నీకు వచ్చిన 'గోల్డ్ మెడల్స్' నీకోసం చూస్తున్నాయి,నీవు వాటికి జతగా ఇంకో మెడల్ తెస్తావని..
మరో ముఖ్యమైనది , నీ చేతిలో ప్రతీక్షణం ఉండే నీ ఫోన్ , నీ చేతివేళ్ల స్పర్శకై   వేచి చూస్తుంది, నువ్వు వస్తావని.
రోజు నాతో గొడవపడి  తీసుకొనే టూ వీలర్ 'కీ' , ఏ గొడవ లేకుండా నీకోసం ఎదురుచూస్తుంది.
నీకు మాత్రమే ప్రత్యేకమైన నీ 'లాప్ టాప్' , నీ ఒడికోసం పరితపిస్తుంది.
సోఫా లో నీవు మాత్రమే కూర్చునే చోటు , నీవు కూర్చుంటావని, తనపై పడిన దుమ్మును దులుపుకొని , నీకోసం ముస్తాబవుతుంది, నీ రాకకై..

నీ తలకు తగలకుండ ఒక్కరోజైన నిన్ను లోపలికి ఆహ్వానించాలని,,ప్రతి రోజు గుమ్మం ఎదురుచూస్తునే ఉంది..

అన్నీటికన్న ముఖ్యమైనది.. నీకు నీ స్నేహితులు పదవ తరగతిలో ఇచ్చిన బహుమతిలో ఏముందో , నీవు గొప్ప స్తితిలోకి వచ్చాక విప్పిచూస్తానన్నవు కదా,,, పాపం అది ఇంకా నీవు వస్తవని, తనని విడిపిస్తావని ఎదురు చూస్తూనే ఉంది.....

5 Feb 2016

Your favourite dish ...... నీ చిన్నప్పుడు గుర్తుందా

నీ  చిన్నప్పుడు గుర్తుందా ....... Your favourite dish

చిన్నా ,,,,,,ఈరోజు నీకు ఇష్టమైన , చికెన్ , పప్పు చారు, తెల్ల వంకాయ కూర వండాను  తెలుసా !!నాకు తెలుసు నీకు కోపం వస్తుందని ..... ఏంటి,, మమ్మీ  నాకు  ఇష్టమైన వన్ని  ఒకేరోజు వండకు అని చెప్పానుగా " అని తిట్టడానికి ఐన వస్తావని ఆశ ....
       
నీ  చిన్నప్పుడు గుర్తుందా ,, నీ చుట్టూ తిరుగుతూ రెండు గంటలు తినిపిస్తే కాని   తినేవాడివి కాధు. . నీకు నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంట    నీకు  రోజు చపాతీ పెట్టెదాన్ని .  మమ్మీ  " రోజు చపాతీ వద్దు , నాకు అన్నం కావాలి అని ఎడ్చావు ,, నాకు చాల బాధ వేసింది , ఏడుపు వచ్చింది కూడ .  నీకు రోజు అన్నం కూడా పెట్టలేని పరిస్థితి చూసి ఏడ్చాను .  ఓ రోజు సపోటా పళ్ళు కావలని  ఎడ్చావు , నా దగ్గర పది రూపాయలు కూడా లేవు , నువ్వు చాల ఎడ్చావు , కావాలని . ఆరోజు ఎన్ని దెబ్బలు తిన్నవురా నా చేతిలో ...
 ఇప్పుడు నీకు సపోటా   తోట కొనివ్వగలిగే స్థితిలో ఉన్నా , నీవు  అడగని లోకంలో ఉన్నావు,  సపోటా పళ్ళు వాటి కమ్మదనన్నే కోల్పోయాయి ఇప్పుడు .

నీకు గుర్తుందా ,,,, 4 వ తరగతిలో అనుకుంట ,,,, రోజు  టిఫిన్ బాక్స్ లో అన్నం అంతా వదిలేసి వచ్చేది , చపాతీ పెట్టిన తినక పోయేవాదివి.  అలాకాదు  ,, వేడిగా   బాక్స్ పెట్టిస్తే తింటావేమొ  అని  మద్యాన్నం  స్కూల్ కి లంచ్ బాక్స్ తీసుకొని  వస్తే కుడా తినేవడివి కాదు .. అలా దాదాపుగా ఆరు నెలలు తినలేదు .. ఏమి చేయాలో నాకు అర్ధం కాలేదు , , ,  ఓ రోజు , చెల్లెకు బాక్స్ లో అన్నం పెట్టి , నీ బాక్స్ లో ఏమి పెట్టకుండా , కాలి లంచ్ బాక్స్ ఇచ్ఛాను . స్కూల్ లో  లంచ్ బాక్స్ ఓపెన్  చేస్తే  అందులో ఏమి లేదు ..  ఆరోజు సాయంత్రం ఇంటికి రాగానే  నీ  మొహం లో కోపం , ఆకలి కనబడ్డాయి , నాకు చాల బాధ అనిపించింది  అలా చేసినందుకు ..  " నాకు అన్నం ఎందుకు పెట్టలే " అని ఎడ్చావు .  నిన్ను దగ్గరికి తీసుకొని , " మరి రోజు నువ్వు బాక్స్ లో  అన్నం పదేస్తున్నావ్ కదా ,,, ఈరోజు నేను పడేసి ఎంప్టీ బాక్స్ పెట్టాను .  నీకు ఆకలి వేసి  కోపం కూడా వచ్చింది కదా ... మరి రోజు నువ్వు అన్నం తినకుంటే నాకు కూడా కోపం వస్తుంది కదా .. ఇప్పుడు నీకు అన్నం విలువ తెలిసిందా " అని  అప్పుడు తినిపించాను .. ఆరోజు నుండి నువ్వు బాక్స్ కాలి  చేసి వఛ్చేవాడివి ..

ఇప్పటికి కూడా నాతో పాటు కూరగాయల మార్కెట్ కి వచ్చినపుడు , మమ్మీ  ఇందులో ఫ్రెష్ కూరలు ఎలా తెలుస్తాయి  అని  అడిగేవాడివి .. నేనేమో , వంకాయలు తొడిమలు  పెద్దగ ఉండేవి ,  బెండ కాయలు చివర్లు  ఇలా విరిగి పోయినపుడు , సోరకాయ ఫై  ఇలా గోరు దిగినపుడు ,  చిన్న ఆకు ఉన్న కొతిమిర   బాగుంటుందని ,, అలా  ఎన్నో మాట్లాడుకుంటూ  కూరలు కొనేవాళ్ళం .. అవి వండుతున్నప్పుడు కూడా  ఎలా వండుతావు అని  నా వెనకాలే నిలబడి చుసేవాదివి.  రోజు  అన్నం తినిపించేతపుడు  ఆరోజో  వండిన కూరలో ఏమి విటమిన్స్ ఉంటాయి , అవి తినటం వాళ్ళ ఏమి లాభమో , శరీరంలో ఏ  పార్ట్ కు అది మంచిదో చెపితే కాని  ఇప్పటికి  నువ్వు  తినేవడివి కాదు కదా .. , మనిద్దరిని డాడీ  చూసి నవ్వుకొనెవాడు ..

ఇంత  పెద్దవాడివి అయ్యావు , అయిన కూడా ఇంకా అన్నం తినిపించాలి , నీ ఫ్రెండ్స్ కి తెలుస్తే నవ్వుతారు అంటే , , , లేదు మమ్మీ , నా ఫ్రెండ్స్ కి నేను గొప్పగా చెపుతాను , నాకు ఇంకా  నా మమ్మీ అన్నం తినుపిస్తుందని .  అన్నావ్ గుర్తుందా ...

నేను తినిపివ్వను అంటే , లేదు మమ్మీ , , కనీసమ్ రోజు రాత్రికి ఐన తినిపించు ,, నువ్వు నాకు తినిపిస్తే  రోజు  నీ కాళ్ళు  నొక్కుతా ,, అన్నావు .

కూరగాయలు  ఎందుకు మమ్మీ ఇంత ధరలు ఉన్నాయ్ , అన్నావు . ఓ రోజు , , కానీ  అవి ధరలు పెరిగినా  వాటి విలువ పోగొట్టుకున్నై .. దాంతో పటు రుచిని కూడా పోగొట్టుకున్నై . నా దృష్టిలో ..

Your oats and protein powder still waiting for you.........

3 Feb 2016

Now she is a big girl ...... నీవు చిన్నపుడు చేసిన అల్లరి

నీవు చిన్నపుడు చేసిన అల్లరి ...... Now she is a big girl


చిన్నా ,,,,,,  నీకో విషయం తెలుసా ! వర్ష ఎంత పెద్దది అయిందో తెలుసా , అయిన ఎలా తెలుస్తది ,, నువ్విక్కడ ఉంటె కదా!!!



ఎప్పుడు నీ గురించే  పట్టించుకోనేదాన్నా , అసలు అది ఎలా పెరిగిందో తెలియనే తెలియదు , ఎప్పుడు నీ అల్లరే , నీ చదువే చుసేదాన్నా , నీకు ఎం కావాలో , ఏమి కొనివ్వాలో , ఎక్కడికి వెళ్ళావో , ఎం చేస్తున్నావో , సరిగ్గా తింటున్నా వో  , లేదో  అని నీ కోసం ఎక్కువగా అలోచిన్చేదాన్నా ,,,



ఎప్పుడైన  మనం కూర్చొని మాట్లాడుకుంటున్నపుడు ,, నీవు చిన్నపుడు చేసిన అల్లరి గురించే మాట్లాడుకునేవాళ్ళమా, నీకు 4 సంవత్సరాలు వచ్చినా ఇంకా మాటలు రావడం లేదు ఎందుకు అనే  బాధ పడేవాళ్ళం ... నీవు నీ ఫస్ట్ బర్త్డే రోజు నడవడం స్టార్ట్ చేసావు ,,,, నీవు మాట్లాడిన మొట్టమొదటి మాట ' అమ్మి'  అనడం , నీ మొదటిసారి మాట్లాడిన అతి పెద్ద సెంటెన్స్ ఏదో తెలుసా " అమ్మి, డాయి వచ్చి , చేద్దేయ్యి , చెం చేం  అంటదు మల్లి ".   అని నా దగ్గరికి పరుగేత్తుకొని నా దగ్గరికి వచ్చేవాడివి ,, పొద్దున్న , మద్యహ్నం , సాయంత్రం , ప్రతిసారి రెండు గంటలు నీకు తినిపించడానీకె సరిపోయేది ....



వీటి గురించి ఎన్ని సార్లు మనం మాట్లాడుకున్నాం ,,,, కానీ చెల్లె గురించి చెప్పడానికి ఏమి లేదు , అది అసలు ఎలా పెరిగిందో అని అనుకునేవాళ్ళం కదా ,,,,అది నేను డాక్టర్ అవుత  మమ్మీ అన్నప్పుడు ,,, మనం నవ్వుకునేవాళ్ళం ..



అప్పుడు నువ్వు ఏమనే వాడివి గుర్తుందా !  మమ్మీ ఇది డాక్టర్ అవుతే , ' పేశేంట్  ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నాడు , తొందరగా రండి డాక్టర్ ' అని  నర్స్ ఫోన్ చేస్తే,  ఇది వెళ్ళేవరకు పేషంట్  చనిపోయి  వాడి  పదో రోజు దినాలు కూడా పెడుతారు మమ్మీ .   అని నువ్వు చెపుతే నవ్వుకోనేవాళ్ళం .... దీనికి బద్దకం బాగా ఉంది , నువ్వసలు  దాన్ని ఏమి ఆనవు , చదువు కోనమని కూడా ఆనవు, పనులు కూడా చెప్పవు ,, నీ గారాబం ఎక్కువ అయ్యింది , అని నన్ను అనేవాడివి .... అన్ని పనులు నాకే చెపుతావు  అన్నప్పుడు నేను ఏమన్నానో గుర్తుందా ,,,,



అది మన ఇంటి యువరాణి రా,  దానికి ఎమన్నా కావాలంటే డాడీ తో కొనిచుకుంటుంది ,, ఎమన్నా తినాలంటే నాతో చేపించుకుంటుంది ,, ఇంకా ఎమన్నా కావాలంటే నిన్ను అడుగుతుంది .. నువ్వు దాని బాడీగార్డ్  రా ,, అది వేరే వాళ్ళ ఇంటి మహారాణి ,, మీ బావ వచ్చి తీసుకొని వెళ్ళేదాకా  మనం జాగ్రత్తగా చూసుకోవాలి ,, ఇక చదవడం గురించా ,, అది ఎప్పుడు నీకన్న బాగానే చధువుతుంది ,,,  అని నేను అన్నప్పుడు ,,, ఆ ఆ అలానే నెత్తిమీదా పెట్టుకో అనేవాడివి ...



నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా !!! నువ్వు కనబడకుండా  పోయినపుడు ,,, నువ్వు ఈ ప్రపంచం లోనే లేవని తెలిసినపుడు ,,,నీ శరీరాన్ని  రెండు రోజులవరకు ఇంటికి తేనపుడు ,,, చెల్లకు చెప్పనే లేదురా ... నువ్వింకా రావని ... అది ఏడుస్తుందని ...



అది అమ్మమ్మ , తాతయ్య , నానమ్మ , దగ్గర కూర్చొని , అన్న వస్తాడు , మీరు ఎడువద్దు , అన్నము తినండి, అని ఇంటికి వచ్చిన వాళ్ళను ఎడువద్దు , మా  అన్న మల్లి ఇంటికి వస్తాడు అని  అందరికి చెపుతూ వచ్చిందిరా. 



కాని.  దానికి నువ్వు లేని రోజే తెలిసింది , నువ్విక రావని ,, దానికి తెలుసని మాకు తెలుస్తే  మేము  ఇంకా  ఏడుస్తామని , తెలియనట్టు  ఉంది . ఎందుకో తెలుసా ,,, ఒక ఫాదర్ తన కూతురు ముందు ఎదుస్తే ఒక కూతురిగ   నేను ఎలా చూడాలి మమ్మీ  అందిరా ...... మీరు కనీసం రెండు రోజులైనా నా కోసం ఏదువకుంట ఉంటారు కదా  మమ్మీ   అంది ... 

ఇప్పుడు నువ్వు దాన్ని చూస్తే నమ్మవేమో ,,,, నేను దానికి అమ్మాన? లేక అది నాకు అమ్మానా? తెలియడం లేదు.

1 Feb 2016

చిన్న ,,,, మనం మాట్లాడుకొని ఎన్ని రోజులవుతుందో తెలుసా

చిన్న ..... మనం మాట్లాడుకొని  ఎన్ని రోజులవుతుందో తెలుసా

మనం మాట్లాడుకొని  ఎన్ని రోజులవుతుందో తెలుసా . ప్రతిరోజు ఎన్నో విషయాల్లో పోట్లడుకోనేవాళ్ళం .  నీకు ఎన్నో విషయాలు చెప్పాలని ,  నిన్ను తిట్టాలని , నేను తిడుతుంటే   నువ్వు నన్ను చూసి నవ్వుతుంటే,  నేను మల్లి కోపం మర్చిపోయి  'దొంగ గాడిది '.  అని  తిట్టాలని ఉంది ..

నీకు గుర్తుందా ,,,, ఓ రోజు మనం టీవీ  లో ఏదో సినిమా చూస్తూ  నువ్వు నన్ను అడిగావు , మమ్మీ  'జన్మ ల 'గురించి నువ్వు నమ్ముతావ ? ఇవన్నీ  ఒట్టి  మూడ  నమ్మకాలూ కాదా ? అని అడిగావు .
 దానికి నేను ఎం సమాధానం చెప్పానో గుర్తుంద ,,,   నేను  ' కర్మ సిద్ధంతాన్ని '  నమ్ముతాను .  మనం చేసే ప్రతి పనికి  ఏదో రూపమ్  లో  మనం  ప్రతిఫలం అనుభవిస్తం .  అది  ఈజన్మ లో కాకున్నా , ఏదో జన్మ లో మనం అనుభవించాల్సిందే .....

ప్రతి మనిషికి దేవుడు ఏదో పనులు చెపుతాడు, అవి నెరవేర్చి కానీ మనం ఈ భూమి మిది నుండి వెళ్ళలేము , ఒకవేళ అవి చేయకుంటే మళ్లీ  మనల్ని పుట్టిస్తాడు.

ఇప్పుడు నిన్నే తీసుకోరాదు ,,, నీ చెవికి రంద్రం తో పుట్టావు , అలా పుడుతే ఏమంటారో తెలుసా ,, ఎక్కడో  పాత ముసలాడివి  పుట్టావని  అమ్మమ్మ చెప్పేది , బహుశ  పోయిన జన్మ లో  నిన్ను పట్టిచ్చు కోకుండా  వదిలేసి  డాడీ కానీ నేను కానీ   వచ్చామేమో  అందుకే  మల్లి నువ్వు మాకు పుట్టి  మాతో  పనులు చేపించుకుంటునావు ..  నేను నవ్వుకుంటూ చెప్పాను .

అది సంతోషమైన , బాధ ఆయినా ,  ఇప్పుడు కాకున్నా ఎప్పుడైనా  మనం అనుభావిన్చాల్సిందే ...
అని నేను చెప్పినపుడు , నువ్వు ఏమన్నవో గుర్తుందా .  మనం పోయిన జన్మ లో  రాజులము  కావచ్చు ,  అందుకే  ఇప్పటికి మనకు రాజుల  లక్షణాలు  ఉన్నాయ్ , అన్నావు .

చిన్నా,,,

ఇప్పుడు నిజంగానే నాకు అనిపిస్తుంది ,,,,బహుశ  ఏదో జన్మలో నిన్ను పట్టించుకోకుండా  వచ్హా మెమో ,  అందుకే మాతో కొన్ని రోజులు ఉండి  నీ   పనులు మాత్రం చేపించుకొని   వెళ్లావు , మాగురించి ఏమాత్రం ఆలోచించకుండా .....

25 Jan 2016

భగవంతుడికి,,,

భగవంతుడికి,,,

అక్షిత్ నీ దగ్గర క్షేమంగా ఉన్నాడనే ఆశిస్తు మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. బహుశా వాడి గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు అని వాడి గురించి కొన్ని విషయాలు రాస్తున్నాను.

వాడు లేపకుండానే ఉదయమే మీరు లేచారంటే, వాడు నిద్ర లేచిఉండకపోవచ్చు లేకపోతే తెల్లవారకముందే ఫుట్బాల్ ఆడడానికి వెల్లుండచ్చు.

మీరు బ్రష్ వేసుకొనేటప్పుడు, ఈ బ్రష్ ఎవరిదిరా తిరిగేసి పెట్టారిక్కడ అని ఆశ్చర్య పడకండి, అది ఖచ్చితంగా వాడి బ్రష్,, బ్రేక్ఫాస్ట్ లో ఉక్మా చేద్దామని అస్సలు ఆలోచించకండి, అది వాడికి ఇస్టముండదు, ఇడ్లి, దోశ, లేకపోతే రాత్రి మిగిలిన అన్నం పోపు వేసిన తింటాడు, దాంతో పాటు ఆరు ఎగ్ వైట్స్, ఆరు అరటిపండ్లు ఖచ్చితంగా వాడికి కావలసిందే,,,ఊరికే టేబుల్ పై పెట్టేసి తినమంటే కుదరదు, వాడితో పాటు కూర్చోని ఆ రోజు వాడు ఏ పనులు చేయడానికి వెలుతున్నాడు, మీరు ఏ పనులు చేయడానికి వెలుతున్నారో వాడు మీతో చర్చించాల్సిందే. మీకు చెప్పే తీరిక లేకపోతే వాడు తినడం మానేస్తాడు జాగ్రత్త.

వాడు తినేసి బయటకు వెల్లలేదంటే ఆ రోజంతా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడని అనుకోండి. ఇక రోజంతా వాడు చెప్పే విషయాలు వింటుండండి, సినిమాలు , స్పోర్స్, బవిష్యత్ లో వాడు చేయబోయే పనుల గురించి చెపుతాడు,విసుక్కోకుండా వినండి. ఒకవేళ బయటికి వెల్లాడంటే, వాడు వచ్చేలోపే మీ పనులన్ని పూర్తిచేసుకోండి, వాడు వచ్చాక మీతోనే వాడు తిరుగుతాడు మల్లి.

ఇంట్లో వాడు కనబడకుండా వాడు పాడే పాటలు వినబడుతున్నాయంటే, వాడు బాత్రూమ్ లో ఉన్నాడని అర్థం చేసుకోండి. వాడిపై కోపం వచ్చినపుడు తిట్టాలని మాత్రం అనుకోకండి, ఎందుకంటే తిట్టినాకూడ వాడు నవ్వుతూనే ఉంటాడు, ఆ నవ్వులో మీరు తిట్లే కాదు, మిమ్ములని మీరే మర్చిపోగలరు జాగ్రత్త.

టీవిలో వచ్చే అత్యాచారాలను,అన్యాయాలను వాడికి చూపించకండి,ఆవేదనతో తల్లడిల్లిపోతాడు, చిన్నపిల్లలను మీ ఇంట్లో పనివాల్లుగా పెట్టకండి, మీ పైనే ఎదురుతిరిగే అవకాశం ఉంది. కడుపులోనే పిండాలను చంపే కసాయి వాల్లను కనబడనీయకండి, ఎందుకంటే వాల్లపై పోలీస్ రిపోర్ట్ ఇయ్యడానికి వెనుకాడడు.

వాడి ముందు అమ్మ, మీరు ఎప్పుడు గొడవపడకండి, ఎందుకంటే వాడి జీవితకాలంలో ఎప్పుడు మమ్మీ, డాడి గొడవపడడం వాడు చూడలేదు.

ఈ రోజు వాడి డాడి పుట్టినరోజు, కనీసం కలలోనైనా పది నిమిషాలు వాడిని పంపించండి, ఎందుకంటే కొత్తబట్టలు, కేకులు లేకున్నా, వాడు శుభాకాంక్షలు చెప్పని ఏ పుట్టిన రోజు మేము జరుపుకోలేదు.

రాత్రికి అన్నం బయట తినొస్తాను అమ్మా అంటే, వాడిని మర్చిపోయి పడుకోవద్దు, ఎందుకంటే బయట పర్వాన్నం తిన్నా, ఇంటికొచ్చాక మమ్మి చేత్తో పెరుగన్నం తినిపించుకొని పడుకొనే అలవాటు వాడికి.


వాడిని జాగ్రత్తగా మీ దగ్గర పెంచుకోండి,మాలాగ జారవిడుచుకున్నారంటే, వాడిని మర్చిపోడానికి మీరు చాలా వేదనపడాలి, ఎందుకంటే మా మరణంతోనైనా మేము వాడిని మర్చిపోగలమేమొ కాని, మీరు దేవుళ్లు, మీకు మరణమే లేదు.